స్మారక నిర్మాణం కోసం చెట్లను నరకొద్దు: సీఎం
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఔరంగబాద్ మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో తాజాగా చెట్లను నరికి వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు.
దివంగత బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్‌లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని ఈ మేరకు ఖైరే పేర్కొన్నారు.
ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.