https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114847677150325.jpg

‘సఫాయివాల నిజాయితీ.. అధికారి వక్రబుద్ధి’..

అనంతపురం: రైల్వే స్టేషన్‌లో పనిచేసే సఫాయివాల నిజాయితీ చూపిస్తే.. అధికారి మాత్రం తన వక్రబుద్ధి ప్రదర్శించాడు. కిందిస్థాయి ఉద్యోగి దొరికిందని ఇచ్చిన నగలను అధికారి స్వాహా చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి మూడు నెలల తర్వాత అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఉన్నతాధికారుల అండదండలతో ఆ అధికారి కేసు లేకుండా తప్పించుకున్నాడు.

 

అనంతపురం జిల్లా, గుంతకల్లు రైల్వేస్టేషన్ నిత్యం వేలాదిమంది ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీన ముంబైకి చెందిన ఓ మహిళ నీటి కోసం 6వ ఫ్లాట్‌పారమ్‌పై దిగింది. తిరిగి రైలు ఎక్కుతుండగా ఆమె జాకెట్‌లో ఉన్న బంగారు ఆభరణాల కవరు పడిపోయింది. కింగ్ గ్రూప్‌లో సఫాయివాలగా పనిచేస్తున్న జి.కొట్టాలకు చెందిన రామాంజనేయులు చెత్తను ఊడుస్తుండగా బంగారం ఉన్న కవరు దొరికింది. దాన్ని తీసుకువెళ్ళి సూపర్‌వైజర్ విజయ్‌కు అప్పగించాడు. అతను పై అధికారి హెల్త్ ఇన్స్‌పెక్టర్ అమర్‌నాథ్‌కు ఇచ్చాడు. అయితే ఆ అధికారికి నగలు కాజేయాలన్న ఆశ కలిగింది. నగలు పోలీసులకు అప్పగిస్తానని వారికి నమ్మబలికి.. ఎవరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

 

చివరికి మీడియాకు తెలిసింది. పత్రికల్లో కథనాలు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. అమర్‌నాథ్‌ను తమదైన శైలిలో విచారించారు. చివరికి నగలను పోలీసులకు అప్పగించాడు. అయితే అమర్‌నాథ్‌పై ఏ కేసు లేకుండా కాపాడేందుకు జీఆర్పీ అధికారి నానాతంటాలు పడ్డారన్న విమర్శలొచ్చాయి. నగల విషయం గురించి అమర్‌నాథ్‌ను ప్రశ్నించగా ముఖంచాటేసి తప్పించుకుని పారిపోయాడు. అతని నుంచి 15 తులాల బంగారం, నాలుగు విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నామని, అతనిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు సిఫార్స్ చేశామని జీఆర్పీ సీఐ తెలిపారు.