ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ
బెంగళూరు: కర్ణాటకలో ఈనెల ఐదో తేదీన 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. అభ్యర్థులు, పార్టీ పెద్దలు, ప్రభుత్వంతో పాటు విపక్షాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా ఇప్పటి వరకు వెల్లడైన అన్ని దశల్లోనూ అధికార బీజేపీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. బీజేపీ-11, కాంగ్రెస్-2, జేడీఎస్-1, ఇతరులు-1 స్థానంలో ముందంజలో ఉన్నారు.
6/15:
మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నందున రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయంలో నేతలు, రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్పీకర్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిని మినహాయిస్తే సభలో బీజేపీ బలం 104. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 112 మంది అవసరం. సాధారణ మెజార్టీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించకపోతే బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వ మనుగడకు, విపక్షాల ఆశలకు ఈ ఫలితాలే కీలకం కావడంతో దేశవ్యాప్తంగా ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో ఫలితాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ కోసం ఆలోచిస్తున్నారు.