https://www.ntnews.com/updates/latestnews/2019/tiharjail.jpg

మా జైల్లో తలారీ లేడు..

న్యూఢిల్లీ : నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తీహార్‌ జైల్లో తలారీ లేడని జైలు అధికారి పేర్కొన్నారు. నిర్భయ నిందితులను ఉరి తీయాలనుకున్నప్పుడు ఏదో ఒక రాష్ట్రం నుంచి తలారీని తీసుకువస్తామని ఆ అధికారి తెలిపారు. తలారీ కోసం వెతుకుతున్నామని చెప్పారు.

నిర్భయ కేసులో దోషులను ఉరితీయడానికి తనను తాత్కాలిక తలారీగా నియమించాలని కోరుతూ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన విషయం విదితమే. దోషులను ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు సన్నద్ధమవుతున్నారని, తలారీ లేడనే విషయాన్ని రవికుమార్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. తనను తాత్కాలిక తలారీగా నియమించాలని రాష్ట్రపతిని కోరా రు. దోషులను ఉరితీయడం వల్ల నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌లో అరుదుగా ఉరితీస్తుండటంతో తలారీలను నియమించడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న ఓ వైద్యవిద్యార్థిని (23)పై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్(29), వినయ్ శర్మ (23), పవన్ (22), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్షను విధించగా, 2014 మార్చి 13న ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. తీర్పును సవాల్ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 2017, మార్చి 27న తుది వాదనలు విన్నది. ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ మే 5వ తేదీన తుది తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు ఢిల్లీ హైకోర్టు తీర్పును ఏకగ్రీవంగా ఆమోదించారు.