https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/Ashok-Gehlot-and-Panipat.jpg?itok=GziFsLAS

‘పానీపట్‌’ను చుట్టుముట్టిన వివాదం

జైపూర్‌ : బాలీవుడ్‌ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ రూపొందించిన చారిత్రక చిత్రం పానీపట్‌ను ఓ వివాదం చుట్టుముట్టుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో మహారాజా సూరజ్‌మాల్‌ పాత్రను తప్పుగా చిత్రీకరించారని రాజస్తాన్‌లో జాట్‌లు ఆందోళన చేపట్టారు. అలాగే రాజస్తాన్‌ మంత్రి పర్యాటకశాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ కూడా ఈ చిత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించారని ఆయన విమర్శించారు. ఉత్తర భారతంలో పానీపట్‌ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ చిత్ర ప్రదర్శన కొనసాగితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

పానీపట్‌ చిత్ర వివాదంపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై వస్తున్న ఫిర్యాదులను సెన్సార్‌ బోర్డు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సినిమాలో మహారాజా సూరజ్‌మాల్‌ను పాత్రను తప్పుగా చిత్రీకరించడం వల్ల.. రాజస్తాన్‌లోని చాలా మంది జాట్‌లు మనస్తాపానికి లోనయ్యారని తెలిపారు. సెన్సార్‌ బోర్డు జోక్యం చేసుకోని వివాదాన్ని పరిష్కరించాలన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్‌లు తక్షణమే జాట్‌లతో చర్చలు జరపాలని చెప్పారు. సినిమాలోని పాత్రలను సరైన విధంగా చూపిస్తే.. వివాదాలకు ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు. కళను, కళాకారులను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని.. కానీ వారు ఏ కులాన్ని, వర్గాన్ని, మతాన్ని, దేవతలని, గొప్ప వ్యక్తులని అవమానించకూడదని సూచించారు. 

కాగా, 1761లో జరిగిన మూడో పానీపట్‌ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరాఠాలకు, ఆఫ్ఘానీ రాజుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఈ చిత్రంలో చూపించారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ భౌగా అర్జున్‌ కపూర్, అతని భార్య పార్వతీ బాయ్‌ పాత్రలో కృతీ సనన్‌ నటించారు. అఫ్ఘానీ నుంచి మరాఠా సామ్రాజ్యం పై దండెత్తి వచ్చే అహ్మద్‌ షా అబ్దాలి పాత్రలో సంజయ్‌ దత్‌ నటించారు.