https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/body.jpg?itok=aBh05l5E

దిశ: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి!

సాక్షి, మహబూబ్‌నగర్‌: యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులైన నలుగురు గత శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ).. మరోవైపు తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుల మృతదేహాలను అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు అప్పగించకుండా వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరోవైపు మృతుల కుటుంబసభ్యులు మాత్రం తాము కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి మృతదేహాలను చూడలేదని, ఇకనైనా మృతదేహాలను అప్పగించాలని నిందితుడు చెన్నకేశవుల తండ్రి రాజయ్య సోమవారం మీడియాతో కోరారు. ఇంకా ఎన్నిరోజులు మృతదేహాలు ఉంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మృతదేహాలు అప్పగించడంలో ఆలస్యం చేయడం వల్ల దిశగానీ, చనిపోయినా తమ పిల్లలుగానీ బతికొస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరూ అండగా లేకపోవటంతోనే ఇలా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/12/9/mbnr-disha-A1-father-Husen.jpg

ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు గోస వెళ్లబోసుకున్న కుటుంబసభ్యులు
మక్తల్‌ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్‌ పాషా తండ్రి ఆరిఫ్‌ హుస్సేన్, నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్‌హెచ్‌ఆర్సీ  సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/12/9/mbnr-disha-A3--motherLaxmi.jpg

అదే చివరి చూపైంది..
‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్‌ అడ్డు రావడంతో యాక్సిడెంట్‌లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్‌ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం. ఆ తర్వాత టోల్‌గేట్‌ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది.

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/12/9/mbnr-disha--A2-father-Rajaiah.jpg

మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ?  
తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం.