వేతన భారం పంచాయతీలదే!

Important Links

సిబ్బంది, మల్టీపర్పస్‌ వర్కర్లకు 8500

పంచాయతీల నిధుల నుంచే ఇవ్వాలి

సర్కారు ఆదేశం.. సర్పంచ్‌లు సతమతం

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘పంచాయతీల్లో పని చేసే సిబ్బంది/ మల్టీ పర్పస్‌ వర్కర్లకు నవంబరు నుంచి ఒక్కొక్కరికి రూ.8500 వేతనం గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఇవ్వాలి’’.. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశమిది. ఈ ఆదేశాలతో పంచాయతీ పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. వేతనాల పెంపు, సిబ్బంది నియామకం మంచిదే కానీ, ఆ వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. ‘వేతనాలకు నిధులు ఎలా తేవాలి? పంచాయతీలకున్న మొత్తం ఆదాయం రూ.లక్ష ఉండదు. అందులోనూ వసూలయ్యేది కొంతే? ఈ పరిస్థితుల్లో వేతనాలను పంచాయతీల సొంత నిధుల నుంచి ఎలా సర్దుబాటు చేయగలం?’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీల్లో పని చేసే సిబ్బంది ఏ ఒక్క పనికో పరిమితం కాకుండా.. పారిశుధ్యం, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల వసూలు వంటి పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీ పర్పస్‌ వర్కర్ల పేరిట వీరిని నియమించుకోవాలని, నెలకు రూ.8500 చెల్లించాలని, ఇప్పటికే పని చేస్తున్న సిబ్బందికి కూడా ఇదే వేతనం వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలు ఈ వేతన వ్యయాన్ని భరించే పరిస్థితిలో లేవు. ప్రస్తుతం రాష్ట్రంలోని 12751 పంచాయతీల్లో దాదాపు 40 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

 

వీరికి గ్రామ పంచాయతీలు నెలకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఆర్థిక స్థోమతను బట్టి సర్దుబాటు చేస్తున్నాయి. కాగా, పంచాయతీల్లో ప్రతి 500 జనాభాకు ఒకరు, ప్రతి పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీ పర్పస్‌ వర్కర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈలెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది అదనపు సిబ్బంది అవసరం. పంచాయతీ సొంత నిధుల నుంచే వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించినప్పటికీ అది ఇంకా అమలు కావడం లేదు. సొంత వార్షికాదాయం రూ.లక్ష నుంచి 2లక్షలలోపు ఉన్న పంచాయతీలు దాదాపు 8 వేలు ఉన్నాయి.

 

సహజంగా గ్రామ పంచాయతీ సొంత నిధులతో గ్రామాల్లో అత్యవసర పనులు చేపడతారు. కానీ, సర్కారు తాజా ఆదేశాలతో సిబ్బంది వేతనాలకే డబ్బు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త నియామకాలు సరే, ఉన్న వారికైనా వేతనాలను ఎలా ఇవ్వాలని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రభుత్వమే ఇవ్వాలి: సర్పంచ్‌లు

పంచాయతీల్లో పనిచేస్తున్న, కొత్తగా నియమించనున్న సిబ్బంది/ మల్టీ పర్పస్‌ వర్కర్లకు ప్రభుత్వమే వేతనాలను చెల్లించాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. చిన్న పంచాయతీకి కూడా కనీసం ఇద్దరు సిబ్బంది ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే వీరి వేతనాలు చెల్లించే స్థితిలో పంచాయతీలు లేవని పేర్కొంటున్నారు.