తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు. ఇవాళ సమావేశంలో భాగంగా మహిళల రక్షణపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది. ప్రతిపక్ష టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించింది.
కాగా.. సభలో పూర్తి ఆధిపత్యం చాటాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. సభలో రోజుకో నవరత్నంపై చర్చ, సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేయాలని, విపక్షం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఆయన అన్నారు. ఈ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వ 6 నెలల వైఫల్యాలపై గళమెత్తాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు 21 అంశాలను సిద్ధం చేసుకుంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశాలకు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.