https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/yogi_0.jpg?itok=5MQaV49q

లైంగిక దాడుల సత్వర విచారణకు కీలక నిర్ణయం

లక్నో : లైంగిక దాడుల కేసులపై సత్వర విచారణను చేపట్టే క్రమంలో 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అథ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. పోక్సో చట్టం కింద నమోదైన లైంగిక దాడి కేసులను కూడా ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో విచారణ చేపడతారు. వీటికితోడు లైంగిక దాడి కేసులను మాత్రమే విచారించేందుకు మరో 144 కోర్టులు, పోస్కో కేసులను విచారించేందుకు 74 కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఈ కోర్టుల నిర్మాణానికి ఒక్కో కోర్టుకు యూపీ ప్రభుత్వం రూ 75 లక్షలు వెచ్చిస్తుంది. యూపీ అంతటా దాదాపు 25479 లైంగిక దాడి కేసులు వివిధ కోర్టుల్లో పెండిగ్‌లో ఉండగా వీటిలో చిన్నారులపై నేరాలకు సంబంధించి 42,379 కేసులు వివిధ న్యాయస్ధానాల్లో మగ్గుతున్నాయి. ఉన్నావ్‌ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం లైంగిక దాడి కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఉన్నావ్‌ లైంగిక దాడి బాధితురాలిని నిందితులు సజీవదహనం చేయడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం కలకలం రేపింది. హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటన జరిగిన కొద్ది రోజులకే ఉన్నావ్‌ ఉదంతం చోటుచేసుకోవడం గమనార్హం.