కార్పొరేటర్ హత్య.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై: ముంబై మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీకి ముంబై హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన కార్పొరేటర్ హత్య చేసులో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు దిగువ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సోమవారం హైకోర్టు సమర్థించింది. హత్యకేసులో దాదాపు 11 ఏళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేటర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినందుకు అరుణ్ మరణించే వరకు జైలు జీవితం గడపాలని కోర్టు తీర్పును వెలువరించింది.
కాగా 2008లో హత్య రాజకీయ వివాదంలో శివసేన కార్పొరేటర్‌ను గావ్లీ హత్య చేసిన విషయం తెలిసిందే. ముంబైలో డాన్‌గా పేరొందిన ఆయన.. తొలుత శివసేనలో చేరి రాజకీయంగా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే కొద్ది కాలంలోనే ఆయన శివసేన నుంచి బహిష్కరణకు గురికావడంతో.. అఖిల భారతీయ సేన పేరుతో ఓ పార్టీని స్థాపించాడు. అదే పార్టీ నుంచి పోటీ చేసి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2008లో పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాజా శిక్షతో జీవితాంతం జైలు జీవితానికే పరిమితం కానున్నాడు.