శ్రీలంకతో బంధం బలోపేతం : ప్రధాని మోదీ
హైదరాబాద్: శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆ ఇద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు.. దేశాన్ని బలంగా చూడాలనుకుంటున్న కాంక్షను తెలియజేస్తుందని శ్రీలంక అధ్యక్షుడిని ఉద్దేశించి మోదీ అన్నారు. శ్రీలంక బలంగా ఉండడం వల్ల అది భారత్‌కే కాదు, యావత్ హిందూ మహాసముద్ర ప్రాంతానికి మంచిదన్నారు. రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉందన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ అన్న విధానానికి ప్రాముఖ్యత ఇస్తామని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎప్పూడు పోరాటం చేస్తూనే ఉందని, ఉగ్రవాదంపై పోరు చేస్తున్న శ్రీలంకకు 50 మిలియన్ల డాలర్లు ఇవ్వనున్నట్లు మోదీ చెప్పారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 400 మిలియన్ల డాలర్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హౌజింగ్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 46వేల ఇండ్లను శ్రీలంకలో నిర్మించినట్లు చెప్పారు. తమిళ ప్రజలకు 14వేల ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. శ్రీలంక చెరలో ఉన్న భారతీయ జాలర్లలను అందర్నీ రిలీజ్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గొటబయా రాజపక్స తెలిపారు.