https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/11/29/akkitam.jpg?itok=NqQ5ZTcg

మళయాళీ కవికి ప్రతిష్టాత్మక పురస్కారం

తిరువనంతపురం : సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం 2019 ఏడాదికి గాను మళయాల కవి అక్కితంను వరించింది. అక్కితం అసలు పేరు అక్కితం అచ్చుతన్‌ నంబూద్రి. వీరు ప్రస్తుతం కేరళలోని పాలక్కడ్‌లో నివాసం ఉంటున్నారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది. దీంతో కేరళ నుంచి జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం పొందిన ఆరో వ్యక్తిగా అక్కితం గుర్తింపు పొందారు. ఇంతకుముందు కేరళ నుంచి పురస్కారం సాధించిన వారిలో జి.శంకరకురూప్‌, ఎస్కే పొట్టక్కడ్‌, తకజి శివశంకర పిళ్ళై, ఎంటీ వాసుదేవర్‌ నాయర్‌, ఓఎన్‌వీ కురూప్‌లు ఉన్నారు.

93 ఏళ్ల అక్కితం తన జీవితకాలంలో అనేకమైన అద్భుత రచనలు చేశారు. ఇప్పటిదాకా మళయాళంలో 45కు పైగా రచనలు చేశారు. 1952లో వచ్చిన 'కందకావ్య' అతని మొదటి రచనగా పేర్కొంటారు. బలిదర్శనం, అరన్‌గేత్తమ్‌, నిమీష క్షేత్రం, ఇడింజు పొలింజ లోకమ్‌, అమృతగాతికలు అక్కితం కవికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. శ్రీమద్భాగవతాన్ని మళయాళంలో శ్రీ మహాభాగవతం పేరుతో అనువధించారు. కాగా అక్కితం సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దీంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఆయనను వరించాయి.