https://www.ntnews.com/updates/latestnews/2019/busbhavan2911.jpg

టీఎంయూ ఆఫీసుకు తాళం.. విధులకు హాజరు కావాల్సిందే..

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు విధుల నుంచి మినహాయింపు రద్దు చేసింది ఆర్టీసీ యాజమాన్యం. రాష్ట్ర స్థాయిలో టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు చెందిన ఒకరికి విధుల నుంచి మినహాయింపు ఉండేది. కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం పని చేసేందుకు వీలుగా కార్మిక సంఘాల నేతలకు విధుల నుంచి మినహాయింపును ఇచ్చేవారు. వీరు విధులకు హాజరు కాకపోయినా ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించేది. జిల్లా, డిపో స్థాయిలోనూ కార్మిక సంఘాల నాయకులకు విధుల నుంచి మినహాయింపు ఉండేది.

తాజా పరిణామాల దృష్ట్యా.. కార్మిక సంఘాల నాయకులకు విధుల నుంచి మినహాయింపు ఉండదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో బస్ భవన్‌లోని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. విజిలెన్స్ డైరెక్టర్ రామచందర్‌రావు ఆదేశాల మేరకు తాళాలు వేసినట్లు బస్ భవన్ భద్రతా సిబ్బంది వెల్లడించింది.