ఇదేం పోషకాహారం.. లీటర్ పాలల్లో బకెట్ నీళ్లా..
లక్నో : రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. పిల్లల ఎదుగుదల, పెరుగుదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశం. కానీ ఈ పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సోనభద్ర జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ప్రతి రోజు గ్లాస్ పాలు ఇస్తున్నారు. ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 171 కాగా, ఈ నెల 27వ తేదీన 81 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఆ రోజు ఒక లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపింది వంట మనిషి. ఆ తర్వాత పాలను వేడి చేసి ఒక్కో విద్యార్థికి పాలను సగం గ్లాస్ మాత్రమే పంపిణీ చేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న ఒకరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో విద్యాశాఖ ఉన్నతాధికారుల దాకా చేరింది. దీంతో ఆ సమయంలో పాఠశాలలో విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.