https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/11/29/ACB.jpg?itok=wrZDcJlZ

'అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టం'

సాక్షి, విజయవాడ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టేది లేదని ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ హెచ్చరించారు. శుక్రవారం సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ..  14400 నంబర్‌కు సమాచారం అందిస్తే చాలు.. వారి అవినీతికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు.

కాగా, టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వేల కాల్స్ వచ్చాయని తెలిపారు. కానీ అందులో 770 కాల్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. నిజాయితీపరులు పై ఎటువంటి కేసులు నమోదు చేయమని, అన్ని రకాలుగా విచారించిన తర్వాత అవినీతికి పాల్పడ్డారని తేలాకే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు విశ్వజిత్‌ పేర్కొన్నారు.