https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/11/29/jagga-reddy.jpg?itok=jAkTlvGl

‘ఆర్టీసీని వాడుకుని రాజకీయం చేయలేదు’

సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులను వాడుకుని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ రాజకీయం చేయలేదని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్‌.. ఎక్కడ ప్రైవేటీకరణ అనే ప్రకటన చేయలేదని అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇక ప్రైవేటీకరణ అనేదే ఉండదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ చార్జీల పెంపుపైన ప్రజలలో వ్యతిరేకత వస్తే తాము వారి పక్షాన పోరాతామని చెప్పారు. 

రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ఘటనల పట్ల పోలీసులు అప్రమత్తంగా  ఉండాలని అన్నారు. అలాగే ప్రియాంక మృతిపై ఆయన స్పందిస్తూ.. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలు, యువతులు జగ్రత్త పడాలని ఆయన సూచించారు. ఇబ్బందుల్లో వారి కోసం స్పెషల్‌ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే దాబాల వద్ద భద్రత చర్యలు పెంచాలని సీఎం, హోంమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.