చంద్రబాబు మీద దాడి ప్రభుత్వమే చేయించినట్టు చెప్పకనే చెప్తున్నారా?

by
https://www.mirchi9.com/wp-content/uploads/2019/11/Damodar-Goutam-Sawang-Chandrababu-Naidu-Kodali-Nani-2.jpg

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి పర్యటన సందర్భంగా కొందరు ఆయన ప్రయత్నిస్తున్న బస్సు మీదకు రాళ్ళు, చెప్పులు విసిరే ప్రయత్నం చెయ్యడం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు ఘోరంగా ఉంది. ప్రభుత్వమే ఈ దాడులు చేయించింది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్ధించేలా ప్రభుత్వం మాట్లాడటం గమనార్హం.

ఎప్పటిలాగే చంద్రబాబు మీదకు మంత్రులను ఉసిగొలిపారు ముఖ్యమంత్రి జగన్. “నిన్నటివరకు మూడు రోజులు కడపలోనే ఉన్నారు. జగన్ ఒక మాట చెబితే చాలు.. అక్కడి ప్రజలు ఫుట్ బాల్ ఆడేవాళ్లు. ఇతర జిల్లాలకూ వెళ్తున్నారు. అక్కడే కొట్టేవాళ్లం. అమరావతిలోనే ఎందుకు కొడతాం?,” అంటూ మంత్రి కొడాలి నాని చెప్పడం దిగజారుడుతనం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వం నుండి ప్రతిపక్ష నేత మీద దాడిని కనీసం ఖండించకపోవడం గమనార్హం. మరోవైపు రాజకీయనాయకులను పక్కన పెడితే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అలాగే బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దారుణం. ఈ కేసులో అరెస్టయిన వారి మీద కేసులు కూడా నమోదు చెయ్యకుండా విడిచిపెట్టడం విశేషం.

నిరసన తెలపడం భావప్రకటనా స్వేచ్ఛ అని డీజీపీ చెప్పడం ఇక్కడ ప్రస్తావించాలి. నిరసన వ్యక్తం చేసే సమయంలో మేము వారిని అదుపు చెయ్యగలమని భావించాం అంటూ పోలీసులు నిరసనకారులను అక్కడకి రావడానికి అనుమతిచ్చారని పరోక్షంగా ఒప్పుకున్నారు.

పల్నాడులో చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి అల్లర్లు జరిగాయి. అనుమతించినా అల్లర్లు జరుగుతాయి. దానితో ఈ సారి ఏం జరుగుతుందో చుద్దాం అని అందరినీ అనుమతించాం,” అంటూ డీజీపీ చెప్పడం, అది కూడా ఒక జెడ్ కేటగిరి భద్రత ఉన్న ప్రముఖుడి గురించి చెప్పడం ఏమనుకోవాలో? చంద్రబాబు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. అటువంటి తరుణంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం పోలీసు వ్యవస్థకే మచ్చ కాదు.