ప్రియాంక హత్య..దోషులను ఉరితీయండి:మహిళా కమిషన్
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ప్రియాంక హత్య కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. కమిషన్ సభ్యులు సాయంత్రంలోగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రియాంక హత్యపై కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది.
సంచలనం సృష్టించిన ప్రియాంక దారుణ హత్యపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించారు. 'మహిళలపై అఘాయిత్యం చేసేందుకు తోడేళ్లు వీధుల్లో సంచరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. దారుణానికి ఒడిగట్టిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలి. మహిళా కమిషన్ సభ్యులు వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కావాల్సిన సాయం అందిస్తుంది. కమిషన్ సభ్యులు పోలీసులతో కలిసి నిందితులపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తారని' రేఖా శర్మ వెల్లడించారు.