https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106227605297218.jpg

యడియూరప్పపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు

ADVT

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న కాగ్వాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 'కులపరమైన' వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది. ఈ విషయాన్ని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి (ఖర్చుల పర్యవేక్షణ) ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

కాగా, నవంబర్ 20న హనకెరె చెక్‌ పోస్ట్ వద్ద హోం మంత్రి బసవరాజ్ బొమ్మై వాహనాన్ని తనిఖీ చేయలేదన్నఆరోపణలకు సంబంధించి ఇద్దరు చెక్‌పోస్ట్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. చెక్ పోస్ట్ అధికారులకు సహకరించలేదన్న కారణంగా హోం మంత్రి వాహనం నడుపుతున్న డ్రైవర్‌పై మద్దూరు పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేవిధంగా, వరాహ చెక్ పోస్ట్ వద్ద ఈనెల 25న యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర వాహనాన్ని సరిగా తనిఖీ చేయలేదన్న కారణంగా నలుగురు అధికారులను కూడా ఈసీఐ సస్పెండ్ చేసింది. కర్ణాటకలో ఖాళీ అయిన 17 అసెంబ్లీ నియోజవర్గాల గాను 15 నియోజకవర్గాల్లో డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. లిటిగేషన్ల కారణంగా రాజరాజేశ్వరి నగర్, మస్కి నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించ లేదు.