‘మహా’ బలపరీక్ష ముహుర్తం ఖరారు
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. రేపు(శనివారం) ఉద్ధవ్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాలను నిర్వహించడానికి ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు. అయితే ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోళంబ్కర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకరాం చేయించారు.
కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్దవ్‌కు డిసెంబర్ 3 తేదీ వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. మహా వికాస్ ఆఘాడి కూటమి తరఫున ఉద్ధవ్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు.
మహా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. పదవులు విషయంలో బీజేపీతో విభేదాలు తలెత్తడంతో.. శివసేన, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందకు ఎన్సీపీ పావులు కదిపింది. ఈ క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలుపడంతో మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించాయి. సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడంతో పరిస్థితులు మారిపోయాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చాకచాక్యంగా వ్యవహరించడంతో మహా వికాస్ ఆఘాడి కూటమి మహారాష్ట్రలో అధికారం చేపట్టింది.