https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106207868321661.jpg

‘అప్పుడు పొగిడిన సీఎం.. ఇప్పుడు విమర్శించడం సరికాదు..’

ADVT

సిద్ధిపేట: ఆర్టీసీ కార్మికులు.. ఉద్యోగాలు, ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ఐక్యంగా చేసిన పోరాటం ఫలితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొచ్చి కార్మికులకు న్యాయం చేశారని ఓ ఆర్టీసీ నేత వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేసీఆర్ ఇవాళ కేవలం యూనియన్ నాయకుల వల్లనే జరిగిందని చెప్పడం దుష్ప్రచారమని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

 

గతంలో యూనియన్ నాయకత్వం.. ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ఉద్యమంలో మమైకం చేసి.. దాదాపు 20 రోజులు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితని అన్నారు. ఉద్యమంలో యూనియన్ నాయకులను మెచ్చుకుని.. హీరోలని పొగిడిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు దుర్మార్గంగా యూనియన్ నాయకులను బెదిరించే పద్ధతిలో మాట్లడడం సిగ్గుచేటన్నారు.

 

యూనియన్లపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు..

‘‘యూనియన్లను ఎట్టి పరిస్థితుల్లో నేను సంప్రదించేది లేదు. వారిని ప్రగతి భవన్‌కు రానిచ్చే ప్రసక్తే లేదు. ఇంత చెడ గొట్టి, ఇంత నాశనం చేసినవాళ్లను, కార్మికుల బతుకులు బజారున పడేసిన వాళ్లను, కార్మికుల మృతికి కారకులైన యూనియన్‌ నేతలను మేం క్షమించదలచుకోలేదు. క్రమశిక్షణతో ఉంటే సింగరేణి తరహాలో ఆర్టీసీని తీర్చిదిద్దుతాం. సింగరేణి కార్మికులు మొన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా రూ.1.60 లక్షల బోనస్‌ తీసుకున్నారు. నేను చెప్పిన మాట వింటే బాగుపడ్తరు. ఏ యూనియన్‌ సహాయం చేయదు. యూనియన్‌ లేకుంటే ఎట్లా? మేం బాండెడ్‌ లేబర్‌లాగా ఉండాలా? యాజమాన్యం వేధిస్తే ఎలా? అనే ఆలోచన మీకు ఉండొచ్చు.

 

దీనికి నేనొక ఆలోచన చేశా. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున కార్మికులతో ‘వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు చేస్తాం. దానికి సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా నియమిస్తాను. ప్రతి నెలా నిర్ణీత తేదీలో సమావేశం నిర్వహిస్తాం. యాజమాన్యం మిమ్మల్ని వేధించకుండా చూస్తాం’’ అని తెలిపారు. కార్మికులు బతకడమే తనకు ముఖ్యమని, సంస్థ వేరు, కార్మికులు వేరు అనే దురభిప్రాయాన్ని యూనియన్లు కలిగించాయని మండిపడ్డారు. ‘‘సంస్థ కార్మికులది. సంస్థ మునిగిన తర్వాత మీరెట్ల ఉంటరు? ఇది అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను కఠినంగా వ్యవహరించాను’’ అని సీఎం చెప్పారు.