https://www.ntnews.com/updates/latestnews/2019/onions1aaa.jpg

లారీ వదిలి.. ఉల్లిగడ్డలను దోచేశారు..!

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రైతుబజార్లు, దుకాణాల్లో ఉల్లిపాయలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఉల్లి సరఫరా తగ్గడం, డిమాండ్‌ పెరగడంతో ధరలు కూడా బాగా పెరిగాయి. కొన్ని రాష్ర్టాల్లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది. విలువైన వస్తువులు, వాహనాలను చోరీ చేసే దొంగలు కూడా ఉల్లిగడ్డలపై పడ్డారు. ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీని కొంతమంది దుండగులు ఎత్తుకెళ్లి ఉల్లిగడ్డలను తీసుకుని లారీని మాత్రం వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది. నాసిక్‌కు చెందిన ప్రేమ్‌ చంద్‌ శుక్లా అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..'ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలో నాసిక్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లిగడ్డలతో లారీ బయలుదేరింది. ఆ లారీ నవంబర్‌ 22న గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. లారీతో పాటు డ్రైవర్‌ కూడా కనిపించకుండా పోయాడని' శివ్‌పురి ఎస్పీ రాజేశ్‌ సింగ్‌ తెలిపారు. పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా శివ్‌పురి వద్ద ఖాళీ ట్రక్కును కనుగొన్నట్లు ఆయన చెప్పారు.