నవరత్నాల్లో ముఖ్యమైనది ఇది: మంత్రి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టామని వాటిలో మొదటిది పేదలందరికి ఇళ్లు, రెండవది భూ రికార్డుల ప్రక్షాళన అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం విలేకరుల సమావేశంలో డిప్పూటీ సీఎంతో పాటు మంత్రి పేర్ని నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... పేదల ఇళ్లు, భూ రికార్డుల ప్రక్షాళనను అధికారులు సవాలుగా తీసుకోని, గ్రామ వాలంటీర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు జరిగిందని... ప్రైవేటు స్థలాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. పశ్చిమ, కృష్ణ జిల్లాల కలెక్టర్లు రికార్డుల నిర్వహణలో ముందంజలో వున్నారని, గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొంత కాలంగా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళనకు నోచుకోలేదని, రికార్డులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వస్తుందని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నాన్ రెవెన్యూ పనుల్లో సైతం వినియోగించుకోవాలని అన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జమాబందీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనులు త్వరితగతిన జరగవనే విమర్శ ఉందని, రికార్డుల ప్రక్షాళన జరిగాక అత్యంత మంచిపేరు తెచ్చుకునే శాఖగా రెవెన్యూ శాఖ ఉంటుందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు.
అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ.. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలపై రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో 9 జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్లు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు. ఇక నవరత్నాల్లో ముఖ్యమైనది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే అని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద వాడికీ ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన అన్నారు. అలాగే మార్చి నాటికి 13 లక్షల ఇళ్లు కేంద్రం నుంచి పొందేలా చర్యలు చేపడుతున్నామని, వీలైనన్ని మండలాలను యుడీఐ కిందకు తెచ్చెలా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు.
ఇక రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 25 లక్షల ఇళ్లు పేదవారికి ఇవ్వబోతున్నామని, తమ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు, ఇళ్ల స్థలాలు దాదాపు 70శాతం మంది అత్యంత పేద వర్గానికి చెందిన వారి కోసమేనని తెలిపారు. ఇళ్ల బిల్లులు మంజూరు చేసేటప్పుడు అధికారులు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవద్దని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. డబ్బులు తీసుకునే క్రమంలో పై అధికారులకు కూడా ఇది చెడ్డపేరు వస్తుందని.. ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారుల దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు.