https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/11/29/3_2.jpg?itok=Jg4zA769

ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా బెంగాల్‌ తీర్పు

న్యూఢిల్లీ : అస్సాం తరహాలోనే దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ) కార్యక్రమాన్ని నర్విహిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పార్లమెంట్‌ ముఖంగా ప్రకటించడం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై ఎంతో ప్రభావాన్ని చూపింది. పర్యవసానంగానే ఖరగ్‌పూర్, కరింపూర్, కలియాగంజ్‌ నియోజక వర్గాల్లో పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతుల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పడిపోయింది.

కలియాగంజ్, కరీంపూర్‌ అసెంబ్లీ స్థానాలను బంగ్లా సరిహద్దుల్లో ఉన్నాయి. వారిలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లింలతోపాటు హిందువులు కూడా గణనీయంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారిని, ముఖ్యంగా ముస్లింలను వెనక్కి పంపించడం కోసమే అస్సాంలో ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)’ నిర్వహించిన విషయం తెల్సిందే. వలసవచ్చిన వారిని పక్కన పెడితే స్థానిక భారతీయులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోవడం వల్ల అస్సాంలో ఎన్‌ఆర్‌సీ వివాదాస్పదమైంది.

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ కార్యక్రమాన్ని చేపడతామంటూ అమిత్‌ షా ప్రకటించిన వెంటనే తమ రాష్ట్రంలో మాత్రం అందుకు అనుమతించే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎన్‌ఆర్‌సీ కారణంగానే తాను ఓడిపోయినట్లు కలియాగంజ్‌ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కమల్‌ చంద్ర సర్కార్‌ తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ వేరు, దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్‌ఆర్‌సీ వేరని చెప్పడంలో, ఎన్‌ఆర్‌సీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, బీజేపీకి సంబంధం లేదని వివరించడంలో విఫలం అవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మూడు చోట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను అఖండ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం అంటే ఎన్‌ఆర్‌సీని వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లే లెక్క!