ఆ రాణికి చిన్ననాటి నుంచే చెట్లంటే ప్రాణం
సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడంతో మొక్కలు నాటి వన సంపదను పెంచడం కోసం ఒక్కో దేశం ఒక్కోరకమైన ఉద్యమాలను చేపట్టాయి. ప్రస్తుతం భారత దేశంలో ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట సెలబ్రిటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, ఇంగ్లండ్‌లో ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అన్న ప్రచారంతో మొక్కలు నాటే ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తోంది. లండన్ నగరంలో ఈ ఉద్యమానికి ‘ది నేషనల్ ట్రస్ట్’ నాయకత్వం వహిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరం చుట్టూ ఐదు భారీ వనాలు ఉన్నాయి. ఒక్కో వనంలో కోటి పాతిక లక్షల వరకు చెట్లను ఇప్పటికే పెంచారు. ఒక్కో వనం 25వే హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. అదనంగా మరో 30 వేల హెక్టార్లలో భారీ వక్షాల సంరక్షణ బాధ్యతను ఈ ట్రస్టే చూస్తోంది.
ఇప్పుడు ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ ఉద్యమం సందర్భంగా ఈ ఐదు వనాల్లోకి పర్యాటకులను ఉచితంగా అనుమతిస్తోంది. అంటే 20 పౌండ్ల (దాదాపు 1850 రూపాయలు) చార్జీలను రద్దు చేసింది. అలాగే ఒక రోజు వేలాడే టెంటులో బస చేసే చార్జీల్లో వంద పౌండ్లను అంటే, దాదాపు ఏడు వేల రూపాయలను తగ్గించింది. అయితే ఒక షరతు వచ్చే పర్యాటకుడు తప్పనిసరిగా ఓ చెట్టును తీసుకొచ్చి ఈ వనంలో నాటాల్సి ఉంటుంది. ఇది కూడా నగర ప్రజలకు మాత్రమే పరిమితం. బ్రిటష్ రాణి ఎలిజబెత్–2 అలెగ్జాండ్ర మేరి స్ఫూర్తితోని ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అని పేరు పెట్టి ఉంటారు. ఆమె ఒక్క ఇంగ్లండ్‌లోనే కాకుండా కామన్‌వెల్త్ దేశాలతో సహా 53 దేశాల్లో ఆమె చెట్లను విరివిగా నాటడం వల్ల ఆమెను ‘ట్రీ ఏంజెల్’ అని పిలుస్తారు. ఎలిజబెత్ రాణి తన 11 ఏళ్ల ప్రాయంలో స్కాట్‌లాండ్‌లోని తన తల్లి ఇల్లైన గ్లామిస్ క్యాజల్ ఆవరణలో 1937లో మొదటిసారి మొక్కను నాటారు. అప్పటి నుంచి ఆమె మొక్కలు నాటే ఉద్యమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.